ఇస్లాం మరియు నేను-1



   ప్రియమైన మిత్రులారా! ఇదే వ్యాసాన్ని ‘దేవుడు మరియు నేను’ అనే పేరుతో ప్రారంభించవచ్చు. కాని ఇస్లాం ఎందుకు వాడవలసి వస్తుంది అంటే ఆ దేవుడిని ఒక్కొక్క ఆధ్యాత్మిక మార్గం ఒక్కొక్క విధంగా నిర్వచిస్తున్నాయి. కొన్ని మార్గాలలో దేవుడు అంటే కేవలం కష్టాలు తీర్చే, లాభం చేకూర్చే అతీత శక్తి, కొన్ని మార్గాలలో సృష్టికర్త, కొన్ని మార్గాలలో ఆదర్శపురుషుడు. దేవుడు అనే పదానికి అసలు అర్ధం ఏమిటో నాకు తెలీదు కానీ, వాడుకలో వివిధ అర్ధాలతో దేవుడు అనే పదాన్ని వాడుతున్నారు కాబట్టి, ఇస్లాం దేవుడిని ఎలా నిర్వచిస్తుందో, ఏ విధంగా వివరిస్తుందో అదే నా వ్యాసపు ఆసక్తి కాబట్టి ఈ వ్యాసానికి “ఇస్లాం మరియు నేను” అని పేరు పెట్టాను.
                ఇంక అసలు విషయానికి వస్తే ఖురాన్ తనని తాను దేవుని వద్ద నుండి వచ్చిన సందేశంగా ప్రకటించుకుంటుంది. మరియు ఖురాన్ ప్రకారం దేవుని నిర్వచనాలలో ఒకటి సృష్టికర్త. సృష్టికర్త నిజంగా ఉన్నాడా? లేడా? అన్నది మన పరిమితులలో లేని చర్చ. సృష్టికర్త లేడు అనుకుంటే అసలు ఇస్లాం గురించి, దేవుడి గురించి చర్చలే అనవసరం. నేను సృష్టికర్తని వెతుకుతున్నాను. ఉన్నాడేమోనని. ఉంటే నా కొన్ని ప్రశ్నలకు సమాధానాన్ని ఇస్తాడేమో అని. ఖురాన్ దేవుని సందేశంగా ప్రకటించుకుంటుంది కాబట్టి ఇంక ఖురాన్ నే అడుగుతాను న ప్రశ్నలు.
*దేవుడా.. అసలు నన్నెందుకు పుట్టించావు? ఇది నా ప్రశ్న. దీని సమాధానం కోసం ఖురాన్ ని వెతకటం ప్రారంభిస్తే పుట్టించడం మీద దాదాపు 58 రెఫెరెన్సులు లభించాయి. ఇక వాటిని వరుసగా చదవనారంభించాను. కొన్నిటిని ఇక్కడ రాసాను.
7:179 “ఎంతోమంది జిన్నులను, మానవులను మేము నరకం కోసం పుట్టించాము”
--‘నన్ను కూడానా? ఎంతో మంది అన్నాడు కాని అందరిని అనలేదుగా.. కాబట్టి నేను నరకం కోసం కాకపోయి ఉండొచ్చేమో. కాని నరకం కోసం పుట్టించినపుడు అసలు భూమి మీదకి దేనికి పంపటం? డైరెక్ట్ గా నరకంలోనే వేసేయ్యోచ్చుగా’
1౦:4-“ నిస్సందేహంగా ఆయనే తొలిసారి పుట్టిస్తాడు, మరి విశ్వసించి, మంచిపనులు చేసిన వారికి న్యాయసమ్మతంగా పుణ్యఫలం ప్రసాదించేందుకు మలిసారి పుట్టించేవాడు కూడా ఆయనే. సత్యాన్ని తిరస్కరించిన వారికి వారి తిరస్కారవైఖరి మూలంగా త్రాగటానికి సలసలాకాగే నీరు, బాధాకరమైన శిక్ష ఉంటుంది.”
--‘ఇక్కడ మలిసారి ఎందుకు పుట్టిస్తారో చెప్పబడింది. మరి తొలిసారి ఎందుకు పుట్టించబడ్డాను అనేదిగా నా బాధ. చూద్దాం మున్ముందు ఎక్కడన్నా దొరుకుతుందేమో.’
11:119-“ "నేను నరకాన్ని జిన్నాతులు, మనుషులు అందరితోనూ నింపుతాను" అని నీ ప్రభువు అన్నమాట నెరవేరింది.”
--‘అయ్యో అందరితోను అన్న మాట రానే వచ్చేసిందే. అయితే అది అనువాద లోపం ఏమో.. సరే నా అసలు ప్రశ్నకి సమాధానాన్ని వెతికే పని కొనసాగిద్దాం.’
2౩:115-“మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా?
--‘అదేగా నా బాధ.. ఆషామాషీగా పుట్టించి ఉండరు. కచ్చితంగా ఎదో ఒక కారణం ఉంటుంది అనే కదా వెతుకుతుంది..’
౩8:27-“ మేము భూమ్యాకాశాలను, వాటి మధ్యనున్న వాటిని లక్ష్య రహితంగా పుట్టించలేదు. ఇది అవిశ్వాసుల ఆలోచన మాత్రమే. కాబట్టి అవిశ్వాసులకు (నరక) అగ్ని నుండి వినాశం తప్పదు.”
--‘హమ్మయ్య! లక్ష్యం లేకుండా పుట్టించలేదట. మళ్ళీ పునరుద్ఘాటించారు.’
76:2-“ నిశ్చయంగా మేము మానవుణ్ణి పరీక్షించడానికి ఒక మిశ్రమ వీర్య బిందువుతో పుట్టించాము. మరి మేము అతణ్ణి వినేవాడుగా, చూసేవాడుగా చేశాము.”
--‘దేవుడా.. ఇప్పుడు వచ్చింది అసలు పాయింట్. దేవుడు నన్ను పరీక్షించటానికి సృష్టించాడన్న మాట. అంటే నా జీవిత పరమార్థం, జీవిత లక్ష్యం ఈ పరీక్షలో నెగ్గటం అన్న మాట. అయితే పరీక్ష ఏ విషయంలో అనేది తెలిస్తే ఆ విషయాలలో తప్పులు చేయకుండా జాగ్రత్త పడవచ్చు. కాని అంత కన్నా ముందుగా సమాధానం తెలుసుకోవలసిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. అది ఏమిటంటే దేవునికి పరీక్షించవలసిన అవసరం ఏమిటి? ఈ పరీక్ష పెట్టడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఎందుకు ఈ ప్రశ్నలు ముఖ్యమంటే ఈ పరీక్ష పెట్టాలన్న ఆలోచనే నేను పుట్టటానికి కారణం అంటుంది ఖురాన్.  ప్రశాంతంగా శూన్యంగా ఉన్న నన్ను ఈ గందరగోళపు ప్రపంచంలోకి లాగిపడేసిన ఆలోచనకు కారణమైన ఉద్దేశం తెలుసుకోవటం నాకు ఎంతో ముఖ్యం.’
అందుకే ముందు పరీక్ష గురంచి కొన్ని ఆలోచనలు పంచుతాను:
పరీక్ష : ఒక వ్యక్తి యొక్క సమర్థతను అంచనా వేయుట కొరకు నిర్వహించబడే ప్రశ్నలు/అభ్యాసాలతో కూడిన ప్రక్రియ.
అంటే పరీక్ష యొక్క సర్వ సామాన్య ఉద్దేశం సమర్థతను అంచనా వేయటం. ఏ విషయంలో అంచనా వేస్తున్నాం అన్న దాన్ని బట్టి పరీక్ష విధానం మారుతుంది.
మరింత చర్చించే ముందు పరీక్ష ఏ విషయంలో అన్న దాని గురించి ఖురాన్ ఎమన్నా చెప్తుందా వెతుకుదాం:
మొత్తం 6౩ రెఫెరెన్సులు దొరికాయి. చూద్దాం అందులో ఎక్కడన్నా పరీక్ష ఏ సమర్థతను తెలుసుకోవటానికి అన్న  విషయం దొరుకుతుందేమో..
11:7-“ మీలో మంచి పనులు చేసే వారెవరూ పరీక్షించే నిమిత్తం ఆయన ఆరు రోజులలో ఆకాశాలనూ, భూమినీ సృష్టించాడు.”
--‘అంటే మంచి పనులు చేసే సమర్ధతను పరీక్షించటానికా ఈ పరీక్ష? చూద్దాం ఇంకేమన్నా వస్తాయేమో..’
18:7-“జనులలో ఎవరు మంచి పనులు చేస్తారో పరీక్షించే నిమిత్తం మేము భూమండలంలో ఉన్న దాన్నంతటినీ భూమికి శోభాయమానంగా చేశాము.”
--‘మళ్ళీ అటువంటి వాక్యం వచ్చింది.’
21:111-“బహుశా ఇది మీకొక పరీక్ష కాబోలు! ఒక నిర్ణీత గడువు వరకు లబ్ది (చేకూర్చటం) దీని ఉద్దేశం కాబోలు! ఇది కూడా నాకు తెలియదు.”
--‘ ఎందుకంత అనుమానంగా చెప్తున్నారు అన్న విషయం నాకు అర్ధం కాలేదు.’
67:2-“మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించే నిమిత్తం ఆయన చావుబతుకులను సృజించాడు. ఆయన శక్తిశాలి, క్షమాశీలి కూడాను.”
పై వాక్యాలను బట్టి ఈ విషయం కోసమే మిమ్మల్ని సృష్టించాను అని స్పష్టంగా తెలియపరచాకపోయినా, మంచి పనులు చేసే వారెవరో తెలుసుకొనుటకు పరీక్షిస్తున్నట్లు కొంత సమాచారం అందుతుంది.
అయితే నా ప్రశ్న ఏమిటంటే మంచి పనులు చేసే సమర్ధత దేవుడు తెలుసుకోవాలనుకుంటే దానికి పరీక్ష అవసరమా? నేడు ఒక మనిషే ఎదుటి వ్యక్తిని అతని మాటలని బట్టి, అతని చేష్టలను బట్టి అతను ఎటువంటి పనులు చేస్తాడు అన్న విషయాన్నీ అంచనా వేసేస్తాడు కదా.. మరి మనిషిని సృష్టించిన దేవుడికి మనిషికి అన్ని రకాల సమర్థతలు, గుణాలు ఇచ్చిన దేవునికి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రత్యేక స్వభావాన్ని ఇచ్చే దేవునికి(౩౦:౩౦) ఏ సందర్భం లో ఎలా ప్రవర్తిస్థాడో పసిగట్టలేడా? ఒక సాధారణ మనిషే ఎదుటి వ్యక్తిని ఎలా అంచనా వేయగలడో ఈ ఖురాన్ వాక్యం చెప్తుంది.
47:౩౦-“మేము గనక తలచుకుంటే వారందరినీ నీకు చూపి ఉండేవారము. నువ్వు వాళ్ళ ముఖ కవళికలను బట్టి వాళ్లను పసిగట్ట గలిగేవాడివి. అయినప్పటికీ నువ్వు వాళ్లను వాళ్ల మాటల తీరును బట్టి తెలుసుకోగలవు. మీ కార్యకలాపాలన్నీ ఆ ఆరాధ్య దైవంకు తెలుసు సుమా!”
మరి దేవుడు సర్వ సృష్టికర్తకు, సర్వశక్తిమంతునికి పరీక్షించవలసిన అవసరం లేదు అంటాను నేను. ఒకవేళ పరీక్షించి తప్ప ఒకరి సమర్ధత అంచనా వేయలేకపోతే అతను సర్వసృష్టికర్త, సర్వశక్తిమంతుడు కాడు అంటాను. ఉదాహరణకు ఒక శాస్త్రవేత్త ఒక ప్రయోగం చేసి ఒక కొత్త వస్తువు కనిపెడితే అతను దాన్ని తప్పకుండ పరీక్షిస్తాడు. ఎందుకంటే అతను ఆ వస్తువుకు సంబంధించిన సర్వాన్ని సృష్టించలేదు కాబట్టి, అందులో ఉన్న సమస్తం యొక్క లక్షణాలు సంపూర్తిగా తెలియవు కాబట్టి. కాని ప్రతి వస్తువును, దాని యొక్క లక్షణాలను కూడా నిర్దేశించిన ఆ సర్వసృష్టికర్త మాత్రం ఏ మాత్రం పరీక్షించకుండా ఫలితాలను అంచనా వేయగలడు. ఖురాన్ ప్రకారం దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వసృష్టికర్త. మరియు అదే ఖురాన్ ప్రకారం దేవుడు పరీక్షిస్తున్నాడు. కాబట్టి నేను దీన్ని ఖురాన్ లోని పరస్పర వైరుధ్యమైన విషయంగా భావిస్తున్నాను. ఈ వ్యాసంలో, నా ఆలోచనా సరళిలో ఏమైనా లోపాలు ఉంటె తెలియజేయండి. ఇంకా ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు తెలియజేయండి.

Comments

  1. Very deep analysis. Exposed the contradiction very well.

    ReplyDelete
  2. మీ వంటి సత్యాన్వేషికి ఎప్కపటికైనా చ్చితంగా సత్యం బోధపడుతుంది. నా నమ్మకం మీకు ఆ పరమాత్మే సద్గురువై ఉపదేశిస్తాడు. నిజంగా అది జరిగితే మీరు సమస్త మానవాళికి తెలియజేయండి. మీ ఉత్సాహాన్ని కొనసాగించండి.

    ReplyDelete
    Replies
    1. ఆ సత్యం ఏమిటో మీకు బోధపడితే, మీరే నాకు బోధించవచ్చు కదా

      Delete
  3. మీ వంటి సత్యాన్వేషికి ఎప్కపటికైనా చ్చితంగా సత్యం బోధపడుతుంది. నా నమ్మకం మీకు ఆ పరమాత్మే సద్గురువై ఉపదేశిస్తాడు. నిజంగా అది జరిగితే మీరు సమస్త మానవాళికి తెలియజేయండి. మీ ఉత్సాహాన్ని కొనసాగించండి.

    ReplyDelete
  4. //ఒకవేళ పరీక్షించి తప్ప ఒకరి సమర్ధత అంచనా వేయలేకపోతే అతను సర్వసృష్టికర్త, సర్వశక్తిమంతుడు కాడు అంటాను//

    ఇది మీ దురవవగాహన (Misconception) తప్ప మరేమీ కాదు.

    పరీక్ష అనేది మానవాళికి, మానవాళి కోసం. అది దైవం కోసం కాదు. ఈ జీవితం పరీక్ష అనేది దైవం మానవాళికి తెలిపాడు.. మానవాళి జీవిత పరమార్ధాన్ని తెలుసుకుని, తదనుగుణంగా మసలుకునేందుకు.


    //ఖురాన్ ప్రకారం దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వసృష్టికర్త. మరియు అదే ఖురాన్ ప్రకారం దేవుడు పరీక్షిస్తున్నాడు. కాబట్టి నేను దీన్ని ఖురాన్ లోని పరస్పర వైరుధ్యమైన విషయంగా భావిస్తున్నాను.//

    ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో నాకు తెలీదు అని దైవం అని ఉంటే .. అది వైరుధ్యం అయి ఉండేది.. కానీ దైవం అలా అనడం లేదు.. అలా అని మీరు అపార్ధం చేసుకుంటున్నారు.

    ఇది చూడండి.. మరి కొన్ని misconceptions దూరం కాగలవని ఆశిస్తున్నాను.

    https://youtu.be/ifllgTA2pmY

    ReplyDelete
  5. చాలా బాగా వివరించారు. మీపై ఎవరు ఎటువంటి ఫత్వా జారీ చెయ్యలేదా? కుఫ్రూలాంటివి కూడా...

    ReplyDelete
  6. చాలా బాగుంది.

    ReplyDelete
  7. మీ విశ్లేషణ అద్బుతంగా ఉందండి అబ్దుల్ గారు .

    ReplyDelete

Post a Comment